12వ తరగతి పేపర్‌ ఎవాల్యుయేషన్‌లో ఏఐ వాడారా? సీబీఎస్‌ఈ బోర్డు క్లారిటీ

  • ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ విధానంపై తీవ్ర విమర్శలు
  • ఏఐ వాడలేదని బోర్డు వివరణ
  • జవాబు పత్రాలను మాత్రమే డిజిటలైజ్‌ చేశామని వెల్లడి
  • మే 19 నుంచి ప్రత్యేక సమీక్ష
సీబీఎస్‌ఈ 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించలేదని బోర్డు స్పష్టం చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (ఓఎస్‌ఎమ్‌) విధానంపై విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ స్పందించారు.

అనేక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఈ డిజిటల్ మూల్యాంకన విధానాన్ని అనుసరిస్తున్నాయని సంజయ్‌ గుర్తు చేశారు. ఈ సిస్టమ్‌లో ప్రతి సమాధానాన్ని ఉపాధ్యాయులే స్వయంగా స్క్రీన్‌పై చూస్తూ మార్కులు వేస్తారని వివరించారు. మూల్యాంకన విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కేవలం డిజిటలైజేషన్ మాత్రమే చేశామని తెలిపారు.

ఈ ఏడాది దాదాపు 98 లక్షలకు పైగా జవాబు పత్రాలను ఈ విధానంలోనే పరిశీలించినట్లు బోర్డు వెల్లడించింది. అక్కడక్కడా కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉందని అంగీకరించింది. ప్రారంభంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటన్నింటినీ అధిగమించినట్లు తెలిపింది. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం మే 19 నుంచి ప్రత్యేక సమీక్షా ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీల కోసం విద్యార్థులు మే 19 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్కుల వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ కోసం మే 26 నుంచి మే 29 వరకు గడువు ఇచ్చారు. రీఎవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల నుంచి రూ.100 ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ సమీక్ష తర్వాత విద్యార్థికి మార్కులు పెరిగితే ఆ మొత్తాన్ని సీబీఎస్‌ఈ రీఫండ్ చేస్తుంది.

CBSE
CBSE Board
CBSE 12th Exam
CBSE evaluation
AI evaluation
On-Screen Marking
Sanjay Kumar
digital evaluation
CBSE review process
CBSE re-evaluation

More Telugu News